యువత పెడత్రోవ పట్టటంలో మీడియా పాత్ర,,, http://mallikomarneni.blogspot.in/ సౌజన్యం తో.

యువత పెడత్రోవ పట్టటంలో మీడియా పాత్ర


భారతదేశంలో ఉన్నంత మంది యువత ప్రపంచంలో మరే దేశంలో లేరని గణాంకాలు చెబుతున్నాయి.. మరి అలాంటి యువతను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? దేశ ప్రగతిలో ఎంతగా భాగస్వాములను చేయాలి? ఎంతటి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి? ఇలాంటి పలు సవాళ్ళను ముందు పెట్టుకున్న మనదేశంలో, రాజకీయనాయకుల సంగతి సరే సరి, చివరకు మీడియా (ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా) కూడా సమాజ క్షేమాన్ని విస్మరించి చెడుపై ఎక్కువగా దృష్టిని పెట్టి యువతను నిర్వీర్యం చేయటంలో తన వంతు బాధ్యత నిర్వహించటం ఏ మాత్రం క్షమార్హం కాదు. దీనిపై ఒక చిన్న విశ్లేషణను ఈ వ్యాసంలో వివరిస్తాను.
నేడు టీవీ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పలు వార్తా చానెల్స్, రకరకాల సినిమా చానెల్స్ జనాన్ని అనునిత్యం చేరుతూనే ఉన్నాయి. అయితే, సమాజం నుంచి ప్రయోజనం పొందే వీరు, సమాజం పట్ల ఎంతవరకు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు? అంటే చాలా వరకు లేదనే చెప్పాలి. టీవీ చానెల్స్ నేటి యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నేటి ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువగా సినిమా చుట్టూ తిరుగుతూ మంచి, చెడుల విచక్షణ మరచి యువతను లక్ష్యంగా చేసుకొని సొమ్ము చేసుకొంటున్నాయని అనటంలో సందేహం లేదు.

ఇటీవల టీవీ 9 లో ప్రసారం చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ నేను పొరపాటున చూసాను. అది దేనిగురించి అంటే, ఏదో ఒక సిటీ మారుమూల ప్రాంతంలో, పండగ సందర్భంగా రికార్డింగ్ డాన్సులు జరిగాయని. దానికి కొందరు చోటా రాజకీయనాయకుల ప్రమేయం ఉన్నదని వార్త. ఇక ఆ వీడియోని చూపించటం మొదలుపెట్టారు. అమ్మాయిలు కొందరు అర్ధనగ్నంగా చేసే డాన్సులను ఏ మాత్రం మార్ఫింగ్ కూడా చేయకుండా, పలుసార్లు వారి శరీరాలను దగ్గరగా (జూమ్ ఇన్) చేసి మరీ చూపించారు. దీనివలన మనం ఏమి తెలుసుకోవాలి? మనం ఆ డాన్సులు జరిగిన ప్రదేశంలో లేము కదా? అయినాసరే ఎవరూ చూసినా, వారి ఖర్మ అన్నట్లు ప్రపంచమంతా ప్రసారం చేసి పడేసారు. అలాంటి వీడియోలు పిల్లలతో కలిసి వార్తలు చూసే వారెవరికయినా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. వారెవరో రికార్డింగ్ డాన్సులు చేయించుకొని పైశాచిక ఆనందం పొందితే, అలాంటి వార్తలను చెప్పి వదిలేయకుండా, వాటిని దృశ్య రూపంలో ప్రసారంచేసి పబ్బం గడుపుకున్న ఈ వార్తా ఛానల్ ఎవరి హితంకోసం ఉన్నట్లు. నా ఉద్దేశంలో, ఆ రికార్డింగ్ డాన్సులు పెట్టించిన వారికి, టీవీ 9 చానెల్ కి పెద్ద తేడా లేదు.

ఇటీవల అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో, ఆంధ్రజ్యోతి MD వేమూరి రాధాక్రిష్ణగారితో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో, కొంతమంది ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఒక మిత్రుడు ఇలా అడిగాడు. అయ్యా! మీరు అప్పటి గవర్నర్ N. D తివారి గారి రాసలీలలను ప్రసారంచేసినప్పుడు దృశ్యరూపాలతోపాటు, ఎంతటి రసికుడవో అని ఓ సినిమా పాటను కూడా ప్రసారం చేసారు. ఇది ఎంత వరకు సబబు. మరీ అంతగా మీరు ఓ సినిమా తీసినట్లు ఎందుకు ప్రసారం చేసారు అని. అలాంటివి అంత అవసరమా అని ప్రశ్నించారు. దానికి రాధాకృష్ణగారు ఓ వితండవాదం చేసారు. ఎంతమంది వ్యక్తులు పోర్నోగ్రఫీ వెబ్సైట్లను చూడటంలేదు అని. దానిని అలా చూపిస్తేనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని. ఈ సమాధానం విని నేను గతుక్కుమన్నాను. ఎవరో ఏదో చూసారని, చూస్తున్నారని సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన మీడియా కొంత నిర్లజ్జగా వ్యవహరించవలసి రావటం నిజంగా మన దురదృష్టం. సినిమాలలో చూపిస్తున్నారని, ఇంటర్నెట్లో చూస్తారని ఇక టీవీ చానెల్స్ కూడా ఇలా దిగజారటం జనానికి ఏ సందేశం అందిస్తుంది?
నాకు ఎక్కువ అసహ్యం కలిగించే విషయం ఏమిటంటే దాదాపు అన్ని టీవీ చానెల్స్ వారు ప్రసారం చేసే సినిమా కార్యక్రమాలలో పలాని హీరో లేదా హీరొయిన్ నేటి యువతకు కలల రాకుమారుడు/రాణి అని ఎలాంటి సిగ్గు లేకుండా ఊది పారేయటం. ఇది ఒక రకంగా చెప్పాలంటే, యువతను ఎవరికో బానిసలు అయినట్లు చూపించటం. ఇలాంటి పరిణామం చాలా బాధాకరం. పలాని హీరో లేదా హీరొయిన్లకు చాలా అభిమానులు ఉన్నారని చెప్పటం వరకు సబబు. కాని యువతను సినిమాయే ప్రపంచంగా బ్రతుకుతున్నారని చూపించటం ఇప్పటికే పలువురు యువకులను పెడత్రోవ పట్టించింది. ఇవేవీ యువతకు తోడ్పాటు కలిగించే ప్రసారాలు కావు. వారి వయసులో ఉన్నఆకర్షణను సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో దాదాపు అన్ని చానెల్స్ పోటీపడుతున్నట్లున్నాయి. యువతను ఒక సినిమా వ్యక్తిని ఆరాధించే స్థాయికి ఎందుకు తీసుకొస్తున్నారు? దీనికి మీడియానే ప్రధమ ముద్దాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. నా విద్యార్ధులు చాలామంది నన్ను ఓ సోషల్ నెట్ వర్క్ సైట్లో కలుస్తారు. వారిలో కొద్దిమంది వారి ప్రొఫైల్ ఫోటోలో వారి బొమ్మకు బదులు ఏదో ఒక హీరో బొమ్మ లేదా హీరొయిన్ బొమ్మ పెడుతూ ఉంటారు. దీనికి అర్థం ఏమిటి? అంటే వారిని వారే ఇష్టపడటం లేదనా? లేక వారికంటే ఆ హీరో లేదా హీరొయిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారనా? నాకెప్పటికీ అర్థం కాలేదు. వ్యక్తిపూజకు దూరంగా ఉండటం సమాజానికి చాలా మంచిది. వ్యక్తికంటే అతని వ్యక్తిత్వాన్ని గౌరవించటం నేర్చుకోవాలి.
కనిపించిన ప్రతి యువకుడి/యువతి వద్దకు పొలోమని పరుగెత్తి, వారి ముందు మైకుపెట్టి ఏదో ఒక విషయంపై స్పందించమంటే, వారికి నేలపై నడుస్తున్నట్లు గుర్తుండదు. అలాంటి ఫోకస్ రావాలన్నా కూడా ఒక అర్హత ఉండాలి. లేదంటే, మీడియా గుర్తిస్తుందని దుందుడుకుగా వ్యవహరించే యువతకు నేడేమీ కొదువలేదు.
ఏ విషయమైనా చెడ్డది కావటమే దాని అర్హత, ఇక మీడియా చెలరేగిపోతుంది. దానిని పదే పదే చూపించి బుర్ర తొలిచేస్తుంది. డ్రగ్స్ కేసులో చిక్కిన/ఆరోపణలున్న యువహీరోలతో ఇంటర్వ్యూలు, సెక్స్ రాకెట్లలో చిక్కిన భామామణుల స్పందనలు, తప్ప తాగి దురుసుగా వాహనం తోలిన ఓ చవకబారు హీరో క్లిప్పింగ్లు, నరహంతకులపై ఫోకస్, వాటిపై ప్రత్యక కార్యక్రమాలు ఎవరి హితం కోసం? వార్త తెలియజేయటం మీడియా బాధ్యత, అంతేకాని అర్హత లేని ప్రతి చెత్త విషయంపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి జనంపైకి వదలటం భావ్యం కాదు. సమాజ హితంకోసం, ప్రతి క్షణం పాటుపడే మహానుభావులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటి వారితో ఇంటర్వ్యూలు ప్రసారం చేయవచ్చు. వారిని ఆదర్శంగా తీసుకొమ్మని చెప్పవచ్చు. అలా జరిగినప్పుడే మంచికి, చెడుకు తారతమ్యం తెలుసుకొని యువత పురోగమిస్తుంది. ప్రొద్దున లేచిన దగ్గరనుంచీ, 24 గంటలూ చెడుపై దృష్టి పడకుండా నేటి యువతను కాపాడుకోనవలసిన బాధ్యత మనందరిపై ఉంది.
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ఈ టీవీ చానెల్స్ వారికి ఏ మాత్రం అవగాహన లేదు అనిపించేలా వీరు ఏదైనా పండుగ సందర్భంగా చేసే ప్రసారాలు ఉంటాయి. ప్రతిదీ ఏదో ఒక సినిమాతో ముడిపెట్టి ప్రేక్షకుల చెవులను మెలిపెడతారు, బుర్ర తోలిచేస్తారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి సమాజానికి ఎంతగానో మేలు చేస్తాడు. వాటిని తరతరాలకూ అందించే బాధ్యత అందరూ తీసుకోవాలి. ఒక పండుగ వస్తే, దాని విశిష్టత ఏమిటి? ఎందుకు జరుపుకోవాలి ? అలాంటి పిండి వంటలనే ఎందుకు చేయాలి? వాటికున్న చారిత్రిక నేపధ్యం ఏమిటి అనేవి తెలియజెప్పాల్సిన బాధ్యతను తుంగలో తొక్కి ఎంతసేపూ సినిమా కార్యక్రమాలతో కాలక్షేపం చేయమని జనులపై రుద్దటం శక్తివంతమయిన మీడియా చేయవలసిన పని కాదు. అందుకే పెద్దలను గౌరవించలేని విష సంస్కృతి ఇప్పుడు త్వరత్వరగా ప్రబలుతుంది. ఇది ఒక సమాజ పతనానికి దారి తీస్తుంది. కొన్నాళ్ళకు చేతినుండా డబ్బు మిగులుతుంది కాని, ఈ యువతకు దారి చూపే వారే కరువవుతారు. అలా కాకుండా ఉండాలంటే, ఈ చానెల్స్ సాధ్యమయినంత వరకు చూడకపోవటమే మంచిది. సిని"మాయే" ప్రపంచం/జీవితం కాదని అందరూ యువతకు ప్రభోదించాలి. అప్పడే యువత తనకున్న బలహీనతలను తొలగించుకొని త్వరత్వరగా భారతదేశం ఒక బలమయిన శక్తిగా ఎదగడానికి తోడ్పడుతుంది.  http://mallikomarneni.blogspot.in సౌజన్యం తో.. 

0 కామెంట్‌లు :: యువత పెడత్రోవ పట్టటంలో మీడియా పాత్ర,,, http://mallikomarneni.blogspot.in/ సౌజన్యం తో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి